అమరావతి నిర్మాణానికి కొత్త ఊపొచ్చింది 10 d ago

AP : సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని, అందుకు తగినంత ఆదాయం కావాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే అందరి లక్ష్యమని, ఇందులో కలెక్టర్లది కీలకపాత్ర అని పేర్కొన్నారు. సంక్షేమాన్ని ఎక్కడా నిర్లక్ష్యం చేయడం లేదని, తొమ్మిది నెలల్లో అనేక హామీలు అమలు చేశామన్నారు. ఎక్కడా లేని విధంగా పింఛన్ రూ.4 వేలు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో రూ.200గా ఉన్న పింఛను రూ.2 వేలు చేసింది తామేనని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.3 వేల పింఛను రూ.4 వేలు చేశామని, దివ్యాంగల పింఛను రూ.6 వేలకు పెంచామని చెప్పారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు అందజేస్తున్నామని, కేవలం పింఛన్లు కోసమే రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇవి ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, స్కూళ్లు ప్రారంభం అయ్యేలోపు పోస్టింగులు ఇస్తామని తెలిపారు. కేంద్రం సాయంతో పోలవరం పరుగులు పెడుతోందని, 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని, స్కూళ్ల ప్రారంభానికి ముందే ఈ పథకాన్ని అందజేస్తామన్నారు. అధికారంలోకి రాగానే అమరావతి పనులు పట్టాలెక్కించామని, విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ పునః నిర్మాణం చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే బెస్ట్ మోడల్‌లో అమరావతి నిర్మాణం చేస్తామన్నారు.